హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కిషన్ రెడ్డిని ఆహ్వానించామని, అయితే ఈ విషయంపై ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో స‍్థిరపడేవాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శనివారం మంత్రి తలసాని విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
’హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ శ్రద్ధ వహించి మెట్రో పూర్తి చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రూ.12,500 కోట్ల అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి మేం ప్రోటోకాల్ పాటించాం. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రారంభోత్సవం ముందు రోజే ఫోన్ చేసి చెప్పాం. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని చెప్పారు. అయిపోయిన తర్వాత సాయంత్రం వరకైనా రావాలని చెప్పాం. మొదటి కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు కదా అయినా అది మా పార్టీ కార్యక్రమం కాదు. ప్రోటోకాల్ విషయంలో ఎవరిని కించపరచాలని మాకు లేదు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారో చెప్పండి. మీ గౌరవమే పెరుగుతుంది. (మంత్రి తలసానికి జీహెచ్‌ఎంసీ ఫైన్)