‘మా ప్రపంచం చీకటైపోయింది.. నమ్మలేకపోతున్నా’

న్యూఢిల్లీ: తన సోదరుడు మరణించిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఢిల్లీకి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ప్రపంచం మొత్తం చీకటిగా మారిందని.. ఏం చేయాలో అర్థంకావడం లేదని ఉద్వేగానికి లోనయ్యాడు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఈశాన్య ఢిల్లీలో సోమవారం చెలరేగిన హింసలో గాయపడిన మహ్మద్‌ ఫర్కాన్‌ అనే వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి సోదరుడు మహ్మద్‌ ఇమ్రాన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... పిల్లలకు భోజనం తెచ్చేందుకు ఫర్కాన్‌ బయటికి వెళ్లాడని.. ఈ క్రమంలో బుల్లెట్‌ తగిలి మృత్యువాత పడ్డాడని పేర్కొన్నాడు. ఫర్కాన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారిద్దరు ఇప్పుడు తండ్రిలేని వారయ్యారని కన్నీటిపర్యంతమయ్యాడు.(అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్‌)




‘‘మేమిద్దరం హ్యాండిక్రాఫ్ట్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్నాం. తన కుటుంబం ఈశాన్య ఢిల్లీలోని కర్దాంపురీలో నివసిస్తోంది. అక్కడికి దగ్గరే ఉన్న జఫ్రాబాద్‌ బ్రిడ్జి వద్ద నిరసన జరుగుతుందని తెలిసింది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో తనను కలిసేందుకు ఇంటికి వెళ్లాను. అయితే అప్పటికే తను పిల్లల కోసం ఫుడ్‌ తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడని తెలిసింది. ఇంతలో నాకు ఫోన్‌ వచ్చింది. ఫర్కాన్‌ కాలికి బుల్లెట్‌ తగిలిందని... చెప్పారు. కానీ నేనది నమ్మలేకపోయాను. ఆ తర్వాత వరుసగా ఓ అరడజను ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. దాంతో భయం వేసి.. ఆస్పత్రికి పరిగెత్తాను. జీటీబీ ఆస్పత్రి వైద్యులను బతిమిలాడాను. ఎలాగైనా నా సోదరుడిని రక్షించమని ప్రాధేయపడ్డాను. కానీ అప్పటికే ఆలస్యమైందని.. తను మరణించాడని చెప్పారు. (సీఏఏ అల్లర్లలో హింస)